కేంద్ర మంత్రివర్గంలోని 72 మందిలో 40శాతం మంత్రులపైనా, వివిధ రాష్ర్టాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 643 మంది మంత్రుల్లో 47 శాతం మంది మంత్రులపైనా క్రిమినల్ కేసులు ఉన్నాయని అసోసియేషన్ ఫర్
రాష్ట్రాల్లో 47% మందిపై నేరాభియోగాలు
కొందరిపై హత్య, హత్యాయత్నం, అపహరణ వంటి తీవ్రమైన క్రిమినల్ ఆరోపణలు
బిలియనీర్ మంత్రుల జాబితా టాప్ టెన్‌లో ఆరుగురు తెలుగువాళ్లే
ఏడీఆర్ నివేదికలో వెల్లడి
న్యూఢిల్లీ, సెప్టెంబరు 4 (ఆంధ్రజ్యోతి) : కేంద్ర మంత్రివర్గంలోని 72 మందిలో 40శాతం మంత్రులపైనా, వివిధ రాష్ర్టాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 643 మంది మంత్రుల్లో 47 శాతం మంది మంత్రులపైనా క్రిమినల్ కేసులు ఉన్నాయని అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) సంస్థ వెల్లడించింది. కేంద్ర మంత్రివర్గ సభ్యులతోపాటు దేశంలో 27 రాష్ట్ర అసెంబ్లీలు, మూడు కేంద్రపాలిత ప్రాంతాల మంత్రుల నేపథ్యాన్ని వారు సమర్పించిన అఫిడవిట్ల ద్వారా ఏడీఆర్ ేసకరించింది. గురువారం ఆ వివరాలను వెల్లడించింది. వీరిలో 47 శాతం మంది తనపై క్రిమినల్ కేసులు ఉన్నట్టు పేర్కొన్నారని తెలిపింది. ఏపీ అసెంబ్లీలో 25 మంది మంత్రులు ఉండగా, 22 మంది మంత్రులపై క్రిమినల్ కేసులు ఉన్నాయని తెలిపింది. వారిలోనూ 14 మందిపై తీవ్రమైన కేసులు ఉన్నాయని తేల్చింది. తెలంగాణలో కూడా 15 మంది మంత్రుల్లో 11 మందిపై క్రిమినల్ కేసులు ఉన్నాయని, వారిలో ఆరుగురిపై తీవ్రమైన క్రిమినల్ నేర ఆరోపణలు ఉన్నాయని ఏడీఆర్ వెల్లడించింది. కేంద్ర మంత్రివర్గంలో పార్లమెంట్ ఉభయ సభలకు చెందిన 72 మంది మంత్రులు ఉన్నారు. వారిలో 29 మంది క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్నారు. 19 మంది మంత్రులపై అత్యంత తీవ్రమైన నేర అభియోగాలు ఉన్నాయి. రాష్ర్ట్రాల అసెంబ్లీల్లో 643 మంది మంత్రులు ఉన్నారు. వారిలో 302 మంది తమపై క్రిమినల్ కేసులు ఉన్నాయని వెల్లడించారు. వీరిలో 174 మంది మంత్రులు హత్య, హత్యాయత్నం, అపహరణ, మహిళలపై నేరాలు వంటి అత్యంత తీవ్రమైన క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్నారు.
పార్టీలవారీగా..
రాష్ర్టాల్లో బీజేపీకి చెందిన 336 మంది మంత్రుల్లో 136 మందిపై, కాంగ్రెస్ కు చెందిన 61 మంది మంత్రుల్లో 13 మంది మంత్రులపై క్రిమినల్ కేసులు ఉన్నాయి. తృణమూల్ కాంగ్రె్‌సకు చెందిన 40 మంది మంత్రుల్లో 13 మందిపై, ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన 16 మందిలో 11 మందిపై, సీపీఎంకు చెందిన పదిమంది మంత్రుల్లో ఆరుగురిపై క్రిమినల్ కేసులు ఉన్నాయి.
ఆస్తుల లెక్కలు..
రాష్ర్టాల్లో బాధ్యతలు నిర్వహిస్తున్న మొత్తం మంత్రుల ఆస్తుల విలువ రూ.23,929 కోట్లు. కేంద్ర, రాష్ర్టాల్లో కలిపి చూేస్త మొత్తం 36 మంది మంత్రులు ఒక్కొక్కరి ఆస్తి రూ.100 కోట్లకు పైగానే ఉంటుంది. సగటున కేంద్ర, రాష్ట్ర మంత్రుల ఆస్తి విలువ రూ.37.21 కోట్లు. 30 రాష్ట్ర అసెంబ్లీల్లో 11 అసెంబ్లీల్లో వందకోట్లకు పైగా ఆస్తులున్న మంత్రులు ఉన్నారు. కర్ణాటకలో అత్యధికంగా ఎనిమిది మంది మంత్రులు రూ.100 కోట్లకు పైగా ఆస్తులను సమీకరించారు. ఆ తర్వాతి స్థానం ఏపీ, మహారాష్ట్రలకు దక్కుతుంది. ఆంధ్రప్రదేశ్ మంత్రుల్లో ఆరుగురి ఆస్తులు రూ.100 కోట్లకు పైనే. తెలంగాణ మంత్రుల్లో ఇద్దరు మాత్రమే రూ.100 కోట్లకు పైగా ఆస్తులు కలిగి ఉన్నారని తెలిపింది.
టాప్‌లో బీజేపీ..
పార్టీల వారీగా చూేస్త బీజేపీలోనే అత్యధికంగా 14 మంది రూ.100 కోట్లకు పైగా ఆస్తులున్న మంత్రులు ఉన్నారు. కాంగ్రెస్ లో 61 మంది మంత్రుల్లో 11 మంది బిలియనీర్లు. మూడోస్థానం తెలుగుదేశం పార్టీది. కేంద్ర, రాష్ట్ర మంత్రుల వారీగా చూేస్త దేశంలో అత్యధిక ఆస్తులున్న పదిమంది మంత్రుల్లో గుంటూరు పార్లమెంట్ సభ్యుడు, పెమ్మసాని చంద్రశేఖర్ ఉన్నారు. ఆయన ఆస్తుల విలువ రూ.5,705 కోట్లు. ఆ తర్వాత స్థానంలో ఉన్న కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌కు రూ.1,413 కోట్ల మేరకు ఆస్తులు ఉన్నాయి. మూడోస్థానంలో ఉన్న ఏపీ సీఎం చంద్రబాబు ఆస్తుల విలువ రూ.931 కోట్లు. నాలుగో స్థానంలో ఉన్న ఏపీ మంత్రి నారాయణ ఆస్తులు రూ.824 కోట్లు. ఐదోస్థానంలో ఉన్న కర్ణాటక మంత్రి సురేశ్ కు రూ.648 కోట్ల ఆస్తులున్నాయి. ఆరో స్థానంలోని తెలంగాణ మంత్రి గడ్డం వివేకానంద్ ఆస్తుల విలువ రూ.606 కోట్లు. ఏడో స్థానంలో ఉన్న ఏపీ మంత్రి లోకేశ్ ఆస్తుల విలువ రూ.542 కోట్లు. ఎనిమిదో స్థానంలో ఉన్న మహారాష్ట్ర మంత్రి మంగళ్ ప్రభాత్ లోథా ఆస్తుల విలువ రూ.447 కోట్లు. తొమ్మిదో స్థానంలోని తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆస్తుల విలువ రూ.433 కోట్లు. పదో స్థానంలోని మధ్యప్రదేశ్ కు చెందిన కేంద్ర మంత్రి జ్యోతిరాఽథిత్య సింధియా ఆస్తుల విలువ రూ.424 కోట్లు. కాగా, అతితక్కువ ఆస్తులున్న పదిమంది మంత్రుల్లో త్రిపురకు చెందిన శుక్ల చరణ్ నోషియాకు కేవలం రూ.2 లక్షలు మేరకు మాత్రమే ఆస్తులు ఉండడం గమనార్హం. కాగా, ఆస్తులతోపాటు అత్యధిక అప్పులు ఉన్న మంత్రుల్లో కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఉన్నారు. ఆయన అప్పుల విలువ 1,038 కోట్ల మేరకు ఉన్నాయి. ఏపీ మంత్రి నారాయణ అప్పుల విలువ 190 కోట్లు ఉంటుందని ఏడీఆర్ తెలిపింది.